అమరావతి, జూలై 26: డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి, స్వతంత్ర దర్యాప్తుకు సహకరించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ డిమాండ్ చేశారు.ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన అంశం కావడంతో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు.డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా, మెరిట్ జాబితా, రోస్టర్ అమలు, ఎంపిక ప్రక్రియ పారదర్శకతపై అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లాల వారీగా హాల్‌టికెట్ నంబర్లు, మార్కులు, రిజర్వేషన్ వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.ఆరోపణల్లో నిజం లేకపోతే స్వతంత్ర దర్యాప్తుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించిన కొండా రాజీవ్‌గాంధీ, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.కేంద్రంలో ఒక విధమైన ప్రమాణాలు, రాష్ట్రంలో మరో విధమైన ప్రమాణాలు ఉండకూడదని పేర్కొంటూ, కేంద్రంలో వివాదాలపై విచారణకు మద్దతు ఇచ్చే ఎన్డీయే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ వ్యవహారంపైనా అదే వైఖరి అవలంబించాలని కోరారు.అయితే, రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2025 నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ప్రశ్నపత్రం లీకేజీ లేదా డేటా మానిప్యులేషన్‌కు అవకాశం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. మంత్రి నారా లోకేష్ కూడా ఆరోపణలను ఖండించారు.ఈ నేపథ్యంలో డీఎస్సీ అంశంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి అభ్యర్థుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కొండా రాజీవ్‌గాంధీ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
డీఎస్సీ వివాదంపై లోకేష్ రాజీనామా చేయాలి: వైఎస్సార్‌సీపీ నేత కొండా రాజీవ్‌గాంధీ
26
Jul