అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం రాజకీయ చర్చకు దారితీసింది. గుంటూరులో జరిగిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఇద్దరు నేతలు పాల్గొనడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ ఘటనపై స్పందించిన అంబటి రాంబాబు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఓ పోస్టు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి కలిసి మాట్లాడుతున్న ఫొటోతో పాటు, తాజాగా తాను బొండా ఉమాతో మాట్లాడుతున్న ఫొటోను పంచుకుంటూ.. “నాటి మీ కలయికలో లేని తప్పు.. నేటి మా కలయికలో తప్పు ఎలా అయింది?” అని ప్రశ్నించారు.రాజకీయ విభేదాలు ఒకటి, సంతాప కార్యక్రమాలు మరోటని అంబటి పేర్కొన్నారు. సంతాప సభలకు రాజకీయ నాయకులు హాజరుకావడాన్ని తప్పుగా చూడడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం బొండా ఉమామహేశ్వరరావును ఆదేశించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు తాను హాజరవుతానని బొండా ఉమా తెలిపారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తనపై కావాలనే దుష్ప్రచారం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.