ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.
గురువారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు అవినీతిని అరికడతామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్యే కుటుంబంపై పలు ఆరోపణలు చేస్తూ, ఉద్యోగులపై నిందలు వేయడం సరికాదన్నారు.ప్రొద్దుటూరులో జూదం క్లబ్బులు, చౌడూరు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా, మార్కెట్ యార్డు వ్యవహారాలపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేయాలని కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించాలని అన్నారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎమ్మెల్యే స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ పర్యటన అనంతరం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయని పేర్కొన్నారు.
గమనిక: పై ఆరోపణలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసినవి మాత్రమే. వీటిపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్పందన అందాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: