చెన్నై: తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ మహిళను హత్య చేసిన అనంతరం ఆమె శరీర భాగాలను బిర్యానీలో వండినట్లు పోలీసులు అనుమానిస్తున్న ఘటన చెన్నైలో కలకలం రేపుతోంది.ఈ నెల 5న చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులోని జనరల్ కంపార్ట్మెంట్లో ఓ ఎరుపు రంగు సూట్‌కేస్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సూట్‌కేస్‌ను తెరిచి పరిశీలించగా అందులో మానవ శరీర భాగాలు గుర్తించారు.కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు తమిళనాడు రైల్వే పోలీసులను సంప్రదించారు. చెన్నై రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని 350కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సూట్‌కేస్‌తో ఓ పురుషుడు, మహిళ రైల్వే స్టేషన్‌కు వచ్చి తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో దానిని ఉంచి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుల కదలికలను ట్రాక్ చేయగా వారు లోకల్ రైలులో గూడువాంజేరి ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్ నివాసముంటున్న ఇంటిపై పోలీసులు దృష్టి సారించారు. అదే ఇంట్లో హయాత్ నిషా అనే మహిళ కూడా ఉండేదని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి తనిఖీలు చేపట్టగా అక్కడి పరిస్థితులు మరింత అనుమానాస్పదంగా కనిపించాయి. ఓ బిర్యానీ పాత్రలో అన్నంతో పాటు మానవ శరీర భాగాలను పోలిన అవశేషాలు కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో పలు చోట్ల రక్తపు మరకలు కూడా ఉన్నట్లు సమాచారం.
దీంతో పోలీసులు ఆ పాత్రను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. మృతురాలి తల భాగం ఇంకా లభించలేదని, దాని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.మృతురాలిగా భావిస్తున్న హయాత్ నిషా.. మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య తనకు తమ్ముడు, మరదలు అవుతారని గతంలో స్థానికులకు చెప్పినట్లు పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం.అయితే నిషాను ఎందుకు హత్య చేశారు? హత్య అనంతరం మృతదేహాన్ని ఎందుకు ముక్కలు చేశారు? శరీర భాగాలను బిర్యానీ పాత్రలో ఎందుకు ఉంచారు? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా తెలియాల్సి ఉంది.కేసులో అనుమానితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు అసలు కారణం, మృతురాలి పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: