కడప /ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 9:
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల నాయకులు పిలుపునిచ్చారు.
ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సదస్సుకు సంబంధించిన కరపత్రాలను వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల అధ్యక్షులు పాలజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారని తెలిపారు.
ఉన్నత విద్యను అభ్యసించిన ఏచూరి ప్రజాసేవను తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని, నిబద్ధత, అంకితభావంతో విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతూ, మార్క్సిస్టు సిద్ధాంతవేత్తగా ఎదిగారని అన్నారు.
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా, అనంతరం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. తదనంతరం కార్మిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి, కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగారని గుర్తుచేశారు.
సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన కడపలోని ఉపాధ్యాయ భవన్లో ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఏచూరి అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు.కరపత్రాల విడుదల కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నోవా, సుజాత, లక్ష్మీ, ప్రియ, సుమన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విలేకరి : విజయ్ కుమార్ ( ప్రొద్దుటూరు )
Save or share this story as a newspaper-style Epaper Clip: