వైఎస్ సునీతకు లోకేశ్ ఆఫర్?
జగన్ సొంత మండలం లింగాల నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయాలని ప్రతిపాదన.. గెలిస్తే జడ్పీ చైర్పర్సన్ పదవి?
కడప జిల్లా | సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీతారెడ్డిని రాజకీయంగా రంగంలోకి దింపేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నట్లు పలు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పరిధిలోని లింగాల మండల జెడ్పీటీసీగా పోటీ చేయాలని మంత్రి నారా లోకేశ్.. వైఎస్ సునీతను కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా.. సునీత జెడ్పీటీసీగా విజయం సాధిస్తే జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఇచ్చే ప్రతిపాదన కూడా చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇప్పటికే 2024 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ షర్మిలకు సునీత మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సునీతను తమ వైపు నుంచి బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే లింగాల జెడ్పీటీసీగా పోటీ చేయడం లేదా జడ్పీ చైర్పర్సన్ పదవిపై వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి వైఎస్ సునీత నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే నారా లోకేశ్ నుంచి కూడా ఈ ఆఫర్‌పై అధికారిక ధృవీకరణ లేదు. కాబట్టి ప్రస్తుతానికి దీనిని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: