బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
బెంగళూరు, నవంబర్ 2: రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను సోమవారం ఆయన పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి సులభంగా అందుబాటులో ఉండటం వల్లే ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. 
ఎలక్ట్రిక్ రంపంతో పాఠశాలలోకి ప్రవేశించి బాలికపై దాడి చేసిన ఘటన ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మహిళలు, బాలికలు, మైనర్ల రక్షణ విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
బాధిత బాలిక కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించకపోతే, వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తుందని జగన్ హామీ ఇచ్చారు. 
రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించిన ఆయన, ఈ ఘటనపై ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: