మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

జిల్లాలో 7 పట్టణ స్థానిక సంస్థలు.. 172 వార్డులకు కౌంటింగ్
18 గదులు, 159 టేబుళ్ల ఏర్పాటు.. పటిష్ట భద్రతా చర్యలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కడప, నవంబర్ 2: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి కౌంటింగ్ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.

జిల్లాలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 172 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం 18 గదుల్లో 159 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలను కూడా సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

మొత్తంగా 2,82,176 మేయర్, చైర్‌పర్సన్ ఓట్లు, 1,13,348 వార్డు సభ్యుల ఓట్లను లెక్కించాల్సి ఉందన్నారు. మేయర్, చైర్‌పర్సన్ ఓట్ల లెక్కింపునకు ఐదు గదుల్లో 84 టేబుళ్లు ఏర్పాటు చేసి 12 రౌండ్లలో ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. వార్డు సభ్యుల ఓట్ల కోసం 13 గదుల్లో 75 టేబుళ్లు ఏర్పాటు చేసి 36 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు.

మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ కేంద్రాలు, ఏర్పాట్లు:

బద్వేలు:1,320 వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో ఒక గది, ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. రెండు విడతల్లో లెక్కింపు పూర్తి చేయనున్నారు.

జమ్మలమడుగు: 32 వార్డులకు సంబంధించి మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికల కోసం 30,206 ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకోసం ఒక గదిలో ఎనిమిది టేబుళ్లు ఏర్పాటు చేసి నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నారు. వార్డు సభ్యుల 26,560 ఓట్ల లెక్కింపునకు రెండు గదుల్లో 16 టేబుళ్లు ఏర్పాటు చేసి రెండు విడతల్లో ప్రక్రియ ముగించనున్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ముద్దనూరు రోడ్డును కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేశారు.

కడప నగరపాలక సంస్థ: 66 వార్డులకు సంబంధించి మేయర్ ఎన్నికల కోసం 2,13,488 ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకోసం మూడు గదుల్లో 66 టేబుళ్లు ఏర్పాటు చేసి నాలుగు విడతల్లో లెక్కింపు చేపట్టనున్నారు. వార్డు సభ్యుల 42,640 ఓట్ల కోసం ఒక గదిలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎంఏఎన్‌యూ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు.

మైదుకూరు: 15 వార్డులకు సంబంధించి 12,491 వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు కోసం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఒక గది, 16 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 13 విడతల్లో లెక్కింపు జరగనుంది.

పులివెందుల: 40 వార్డులకు సంబంధించి మేయర్, చైర్‌పర్సన్ ఓట్లలో 38,482 ఓట్లు లెక్కించేందుకు ఒక గదిలో 10 టేబుళ్లు ఏర్పాటు చేసి నాలుగు విడతల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నారు. వార్డు సభ్యుల 18,566 ఓట్ల లెక్కింపునకు మరో గదిలో 10 టేబుళ్లు ఏర్పాటు చేసి రెండు విడతల్లో పూర్తి చేయనున్నారు. ముద్దనూరు రోడ్డులోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

రాజంపేట: 17 వార్డులకు సంబంధించి 11,065 వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు కోసం మన్నూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు గదులు, 17 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 12 విడతల్లో లెక్కింపు చేపట్టనున్నారు.

ఎర్రగుంట్ల: ఒక వార్డుకు సంబంధించి 706 ఓట్ల లెక్కింపు కోసం ముద్దనూరు రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఒక గది, ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఒకే విడతలో లెక్కింపు పూర్తి చేయనున్నారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, ప్రవేశ నియంత్రణ, గుర్తింపు కార్డుల తనిఖీలు, బారికేడ్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టామన్నారు.

లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించడంతో పాటు పోలీసు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ ఓట్ల లెక్కింపును నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *