అమరావతి: మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలపై మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలు వెలుగులోకి వచ్చాయి. గుడ్లు, చిక్కీల సరఫరా కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బకాయిలు ఉన్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఫీజులు సరిగా చెల్లించకపోవడంతో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీంతో స్పందించిన లోకేశ్.. (పరోక్షంగా జగన్‌ను ఉద్దేశిస్తూ) మేనమామనని చెప్పి చిన్నారుల పొట్ట కొట్టాడా? అని ప్రశ్నించారు.వైకాపా హయాంలో గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు రూ.178.5 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించకపోవడంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో గుడ్ల సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా గుడ్లు సరఫరా కాంట్రాక్టర్లకు డిసెంబర్ నుంచి రూ.112.5 కోట్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు గతేడాది ఆగస్టు నుంచి రూ.66 కోట్ల మేర జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని అధికారులు వెల్లడించారు. దీంతో చిన్నారులకు ఇబ్బంది కలగకుండా గుడ్లు, చిక్కీలను పంపిణీ చేయాలని లోకేశ్ ఆదేశించారు. గత ప్రభుత్వ బకాయిలను త్వరలో చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. కాంట్రాక్టర్లు మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వంలోని విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు రూ.3,480 కోట్ల గురించి అధికారులు తెలుపగా.. కళాశాలల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు.

previous post
next post