Tv424x7
National

ఆషాఢంలో దుర్గమ్మ ఆరాధన ఎందుకంత ప్రాముఖ్యత?- సారె మహోత్సవం వెనుక కథేంటి?

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఎన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రిపై భక్తులు కిటకిటలాడతారు. మేళతాళాలతో వచ్చి దుర్గమ్మకు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

ఆషాఢం మాసంలో ఇంద్రకీలాద్రిపై సారె మహోత్సవం ఎందుకు నిర్వహిస్తారో మీకు తెలుసా?. ఎలాంటి శుభకార్యాలూ జరగకపోయినా పూజాది కార్యక్రమాలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఒక్క ఆషాఢ మాసంలోనే సుమారు 2లక్షలకు పైగా భక్తులు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంటారు. సారె రూపంలో తమకు తోచిన వస్తువుల్ని ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఉడతాభక్తిగా సమర్పించుకుంటారు. ఈ మాసంలోనే అమ్మవారు శాకాంబరీ దేవిగానూ దర్శనమిస్తారు.

ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎందుకు నిషేధం?: పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో శ్రీ మహా విష్ణువు 4 నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో శుభ కార్యాలు చేయడాన్ని నిషేధించారు. అయితే ఈ మాసం తీర్థయాత్రలు, ఉపవాస దీక్షలు వంటి పూజాది కార్యక్రమాలకు అనువైనది. ముఖ్యంగా వ్యవసాయానికి ఈ మాసం చాలా ప్రాముఖ్యమైనదిఇంద్రకీలాద్రిపై సారె మహోత్సవం: విజయవాడ కనకదుర్గమ్మకు ఏడాదిలో 4సార్లు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రోత్సవాలు, ఆషాఢంలో వారాహి ఉత్సవాలు, ఆశ్వయుజ మాసంలో దసరా శరన్నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు. వీటిలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు ఈ నెలమొత్తం అమ్మవారికి మొక్కుల రూపంలో సారెను సమర్పిస్తారు. కొందరు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి సారె పెడితే, మరికొందరు తమ మొక్కులు చెల్లించుకునేందుకు ఇదే అనువైన కాలమని భావిస్తారు.ఎలా ప్రారంభమైందంటే: దుర్గమ్మకు సారెను సమర్పించటం వల్ల పంటలు బాగా పండుతాయనీ, ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ కనకదుర్గమ్మకు ఈ మాసంలో భక్తులు బృందాలుగా ఏర్పడి వస్త్రాలు, పూలు, పండ్లు, మిఠాయిలు, గాజులు, కొబ్బరికాయలు సమర్పిస్తారు. అయితే కొన్నేళ్ల క్రితం వరకూ భక్తులకు ఈ అవకాశం ఉండేది కాదు. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమల, అన్నవరం, పెనుగంచిప్రోలు తదితర ఆలయాల నుంచి మాత్రమే దుర్గమ్మకు ఆషాఢం సారె వచ్చేది. తెలంగాణ నుంచి కూడా మహంకాళి దేవాలయాల కమిటీ తరఫున బంగారు బోనం సమర్పించేవారు. 2016లో ఆలయ ఈవో సూర్యకుమారి భక్తులకు కూడా అవకాశం కల్పించటంతో అప్పటి నుంచి భక్తులు సారెను సమర్పించటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై మహోత్సవాన్ని ఆషాఢం సారె మహోత్సవం నిర్వహించనున్నారు.

శాకాంబరి దేవి ఉత్సవాలు ఎందుకు?: దేవీభాగవతం, మార్కండేయ పురాణాల ప్రకారం కనకదుర్గ అవతారానికి పూర్వం అమ్మవారు శాకంబరిగానే అవతరించిందనడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించిందట. ప్రజల బాధలు చూడలేక ఋషులు జగన్మాతను ప్రార్థించినప్పుడు అమ్మవారు శతాక్షీదేవిగా అవతరించిందట. ఆ దేవి తన దేహం నుంచి శాకములను (కాయగూరలు) సృష్టించి ప్రజల ఆకలిని తీర్చడం వల్లే శాకంబరిగా పూజలందుకుందట. అందుకే దుర్గాదేవిని ఈ ఆషాఢంలో శాకంబరిగా కొలుస్తారని చెబుతుంటారు.ఇంద్రకీలాద్రిపై జులై 19 నుంచి 21 వరకు శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మూడురోజులపాటు ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో మొదటిరోజు ఆకుకూరలూ, రెండోరోజు కాయగూరలూ, మూడో రోజు వివిధ రకాల ఎండు ఫలాలతో ఆలయాన్ని, దుర్గమ్మను అలంకరిస్తారు. వాటన్నింటినీ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులూ వ్యాపారులూ అందించడం విశేషం. అలా వినియోగించిన కూరగాయలను తరువాత భక్తులకు కదంబ ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

Related posts

భారత్ జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్న పాకిస్తాన్ గూఢచారులు

TV4-24X7 News

హెచ్‌పీసీఎల్‌లో 247 ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు

TV4-24X7 News

8 ఏళ్ల పసివాళ్ళతో వ్యభిచారం…రాకెట్ లో డిఎస్పి ప్రభుత్వ ఉద్యోగులు

TV4-24X7 News

Leave a Comment