విశాఖపట్నం మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరూ వాహనదారులకు న్యాయమూర్తి 15 రోజులు సాధారణ జైలు శిక్షను విధించినట్టు విశాఖ హార్బర్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ అదనపు ఎస్ఐ పక్కి గణేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలోని పేర్కొన్నారు. మరో 16 మందికి రూ. 10000 చొప్పున జరిమానా విధించారని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హార్బర్ సబ్ డివిజన్ ట్రాఫిక్ సీఐ ఎస్.షణ్ముఖరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను వాహన దారులందరూ పాటించే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్ఐ పక్కి గణేష్ బాబు హెచ్చరించారు.
