విశాఖపట్నం ఇష్టాను సారంగా నగరం లో ఆటోలు నడుపుతున్న డ్రైవర్లపై నగర ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. పరిమితికి మించి మరీ ప్రయాణీకులతో రాకపోకలు సాగిస్తూ ట్రా ఫిక్ నిబంధనలను పట్టిం చుకోని వారిపై నగర పోలీసులు కన్నెర్రజేశారు. నిరంతరం ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై చలానాలు రాస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా కొందరు ఆటో డ్రైవర్లు దురుసుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు కోకొల్లలు. అయితే గురువారం విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి వద్ద ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ విశ్వనాధం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 20 మంది స్కూల్ పిల్లలతో వస్తున్న ఆటోను గమనించి ఆ వాహన డ్రైవర్ కు రూ.10వేల జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, ఆటో వాళ్లు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరించారు. నిబంధనల మేరకు ఆటో డ్రైవర్లు నడుచుకోవాలని అందుకు పోలీసులకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
