విశాఖపట్నం విశాఖలో 37ఏళ్ల పురుషుడి మృతదేహం మంగళవారం కలకలం రేపింది. చిన్న మార్బుల్ పలక ఉన్న ఓ గోనె సంచి (వలతో) లో మృతదేహాన్ని నైలాన్ తాడుతో కట్టేసి ఉండడంతో ఇది కచ్చితంగా హత్యగానే పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లోని 10వ నంబర్ జెట్టీకి మృతదేహం కొట్టుకు రావడం సంచలనమైంది. సినీ ఫక్కీలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంద్రంలో మృతదేహం తేలుతూ ఉండడాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించి విశాఖ వన్టైన్ పోలీసులకు సమాచారమందజేశారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉండడంతో దుర్వాసన వస్తోంది. సంచిలోంచి మృతదేహాన్ని బయటకి తీసి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
