ప్రజా సమస్యలపై మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందిస్తుంటారు. ఇది ఆయనలో మంచి గుణం. అయితే రెడ్‌బుక్ అనేది ఆయనలోని సుగుణాల్ని వెనక్కి నెడుతోందన్న అభిప్రాయాన్ని కాదనలేని పరిస్థితి. తాజాగా వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని జ్యోతిక్షేత్రానికి బస్సు సర్వీస్‌ను నిలిపివేయాలనే నిర్ణయంపై విమర్శలు గుప్పుమన్నాయి. అటవీశాఖ రాష్ట్ర అధికారుల ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించారు. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంగతి తెలిసి… మంత్రి నారా లోకేశ్ జెట్ స్పీడ్‌తో స్పందించడం విశేషం.వెంటనే రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి, అటవీశాఖ, ఆర్టీసీ అధికారులతోనూ మంత్రి లోకేశ్ చర్చించారు. కాశినాయన క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇవాళ్టి మధ్యాహ్నం నుంచే బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల మనోభావాలు, ప్రయాణ సౌకర్యాల విషయంలో ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. మరోవైపు సమస్య సృష్టించడం, మళ్లీ వాళ్లే పరిష్కరించడం… అంతా నాటకాన్ని తలపిస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు సంబంధించిన అటవీశాఖ అధికారులు అడ్డంకులు సృష్టించడం, ఆ తర్వాత మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుని, వాటిని పరిష్కరించి క్రెడిట్ దక్కించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇచ్చే పవన్‌కల్యాణ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. మరోవైపు లోకేశ్‌పై టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
