బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వెనుక కీలక పరిణామాలు.
రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారని నేతల ఆరోపణలు.
కవితకు మంత్రి పదవి దక్కితే మనకే మంచిదన్న కేసీఆర్.
పార్టీ వ్యతిరేకులకు గట్టి హెచ్చరిక పంపేందుకే ఈ నిర్ణయం.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక తీవ్రమైన అంతర్మథనం, పక్కా రాజకీయ వ్యూహం ఉన్నట్టు స్పష్టమవుతోంది.
ఈ నిర్ణయం తీసుకునే ముందు ఫామ్‌హౌస్‌లో ముఖ్య నేతలతో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్ తన కుమార్తె వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
“కవితకు నేనేం తక్కువ చేశాను? నిజామాబాద్ ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశమిచ్చాను. మద్యం కేసులో చిక్కుకున్నప్పుడు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి పోరాడాను. అయినా ఆమె ఎందుకిలా పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించింది?” అని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.
ఈ సమావేశంలో కొందరు సీనియర్ నేతలు మాట్లాడుతూ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారని ఆరోపించినట్టు తెలిసింది.
దీనికి సంబంధించి తమ వద్ద కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని వారు కేసీఆర్‌కు వివరించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కవితపై వేటు వేయకపోతే పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందని, చాలామంది నేతలు సొంత అజెండాతో ముందుకు వెళ్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడినట్టు తెలిసింది.
సస్పెన్షన్ తర్వాత కవిత భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం.
ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వొచ్చని కొందరు నేతలు అంచనా వేశారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ “ఒకవేళ ఆమెకు మంత్రి పదవి వస్తే అది రాజకీయంగా మనకే లాభం చేకూరుస్తుంది” అని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
కుమార్తె విషయంలో కఠినంగా వ్యవహరించడం ద్వారా పార్టీయే తనకు కుటుంబమని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కేసీఆర్ గట్టి సందేశం పంపినట్టయింది.
నేతలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కవితపై వేటు వేయాలన్న తుది నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది.