విజయవాడలో అర్ధరాత్రి నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టుకున్నారు. అజిత్ సింగ్ నగర్ డాబా కోట్లు సెంటర్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే రోడ్డుపై కొట్టుకోవడంతో నగర ప్రజలు అవాక్కయ్యారు.
వివరాల్లోకి వెళ్తే..
విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు, ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస నాయక్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అర్దరాత్రి ఓ వ్యక్తి, మహిళ నడిరోడ్డుపై గొడవ పడుతున్నారన్న సమాచారంతో నైట్ బీట్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. అక్కడ గొడవ పడుతున్న మగ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీవినాస్ నాయక్‌గా గుర్తించారు.
అప్పటికే నడిరోడ్డుపై గొడవ చేస్తూ ఉండటంతో అక్కడికి వచ్చిన నైట్ బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు.. ట్రాఫిక్ కానిస్టేబుల్ అయిన శ్రీనివాస్ నాయక్‌పై చెయ్యి చేసుకున్నాడు. అయితే అదే క్రమంలో అప్పటివరకు శ్రీనివాస్ నాయక్‌తో గొడవ పడిన మహిళ.. ఆయనపై ఎందుకు చెయ్యి చేసుకున్నావ్ అంటూ తిరిగి యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని చెంపపై లాగి కొట్టడంతో వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది.
చివరికి ఇద్దరు కానిస్టేబుల్స్ కావడం.. ఇద్దరూ బాధ్యత తప్పి ప్రవర్తించడంతో.. ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు. నడిరోడ్డుపై అర్దరాత్రి వీరంగం సృష్టించిన ఇద్దరిపై సస్పెండ్ చేస్తూ ఇప్పటికే సిపి వేటు వేయగా ఘటనలో.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌లో చెయ్యి చేసుకున్న మహిళపై సైతం కేసు నమోదు చేశారు. నడిరోడ్డుపై అల్లరి చేయడం.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని కొట్టడం వంటి అంశాన్ని పోలీసులు సిరియస్ తిసుకున్నారు.