నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విషాద ఘటన
ఆస్తి కోసం రక్త సంబంధాలను మరచి మృగంగా మారిన ఓ కుమారుడు కన్న తండ్రినే దారుణంగా హత్య చేసిన ఘటన కల్వకుర్తిలో వెలుగులోకి వచ్చింది.
కల్వకుర్తి వాసవి నగర్‌కు చెందిన బాలయ్య (70)ను అతని కుమారుడు బీరయ్య కర్రతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. ఆపై మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని డిండిచింతపల్లి బ్రిడ్జ్ వద్ద వాగులో పడేశాడు.
బాలయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టి ఘటనా స్థలంలో రక్తపు మరకలు గుర్తించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, హత్య వెనుక బీరయ్యే ఉన్నాడని గుర్తించారు.
అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం బయటపడింది. గజ ఈతగాళ్ల సహాయంతో వాగులో నుంచి బాలయ్య మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.