టీడీపీ, జనసేన సోషల్ మీడియా పూర్తిగా ఆయా పార్టీల పాలసీను, ప్రయోజనాలను పట్టించుకోవడం మానేసింది. ఎవరికి వారు ఈగో సమస్యలతో ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకూంటూ రచ్చ చేసుకుంటున్నారు. ప్రతీ సారి ఓ టాపిక్ తో హైప్ తెచ్చుకుని.. అందర్నీ అందులోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
శివపార్వతి అనే జనసేన నేతకు ఓ కార్పొరేషన్ డైరక్టర్ పదవి వచ్చింది. ఆమె గతంలో టీడీపీ నేతల్ని తిట్టారని .. పాత ట్వీట్లు వెలికి తీసి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జనసేన సోషల్ మీడియా సైన్యంతో వాదులాట పెట్టుకున్నారు. ఒకరినొకరు.. పాత ట్వీట్లు బయటకు తీసుకుని వాదించుకోవడం ప్రారంభించారు. దీని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా అన్నది మాత్రం. ..రెండు వర్గాలు ఆలోచించడం లేదు.
పొత్తు లేనప్పుడు అందరూ విమర్శించుకుంటారు. అంత మాత్రాన.. ఇప్పుడు పాతవన్నీ గుర్తుపెట్టుకుని ఎందుకు ఇలా గొడవలు పెట్టుకోవాలో.. రెండు వర్గాలూ కనీసం ఆలోచన చేయడం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే… టీడీపీ, జనసేన సోషల్ మీడియాల్లో స్వచ్చందంగా తమ సమయాన్ని కేటాయించేవారే ఉన్నారు. అలాగే జనసేన పార్టీ పేరుతో కొంత మంది వైసీపీ సానుభూతిపరుల హ్యాండిల్స్ కూడా ఈ వివాదాలను రెచ్చగొట్టేందుకు ఉన్నాయి. ఈ ట్రాప్ లో అందరూ పడుతున్నారు.
గతాన్ని తవ్వుకుంటే.. వచ్చేది ఏమీ ఉండదు.. రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయి. దానికి తగ్గట్లుగా ఉండాలి. స్వతంత్రంగా పార్టీకి పని చేస్తున్నానని అనుకుంటే సరిపోదు… పార్టీ లైన్ లో ఉండాలన్న కనీస ఆలోచన ఈ స్వతంత్ర కార్యకర్తలకు లేకపోవడంతో టీడీపీ, జనసేన సోషల్ మీడియా వార్లు ప్రతీ అంశంపై జరిగిపోతూనే ఉన్నాయి.