భద్రాద్రి కొత్తగూడెం/సిద్దిపేట: రాష్ట్రంలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటనల్లో ఇద్దరు యువజంటలు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సాయిప్రకాశ్ (25) తన భార్య సంధ్య (22), కుమారులు రుత్విక్ (7), మోక్షిత్ (2)తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటీవల తండ్రి మరణించడంతో తల్లి జ్యోతి, భార్య సంధ్య, చిన్న కుమారుడు మోక్షిత్లతో కలిసి హైదరాబాద్ నుంచి ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు.అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో మాధారం అటవీ ప్రాంతంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిప్రకాశ్, సంధ్య, మోక్షిత్ అక్కడికక్కడే మృతిచెందగా, తల్లి జ్యోతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.మరోవైపు సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో యువజంట మృతి చెందింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ (28) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, ముంబైకి చెందిన దీక్షిత (25)ను ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా, సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వారి బైక్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ వెనుక భాగంలోని కేజ్ వీల్స్ తగలడంతో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దీక్షిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.ఈ రెండు ఘటనలు కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టగా, మృతుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


