న్యూఢిల్లీ, జూన్ 10: ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వ లేదా పంపిణీ కోసం వార్తాపత్రికలను ఉపయోగించరాదని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) మరోసారి స్పష్టం చేసింది. వీధి వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు సహా అన్ని ఆహార విక్రయ కేంద్రాలు ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని సూచించింది.వార్తాపత్రికల ముద్రణలో ఉపయోగించే సిరాలో సీసం వంటి హానికర భారీ లోహాలు, ఇతర రసాయనాలు ఉంటాయని FSSAI పేర్కొంది. ముఖ్యంగా వేడిగా ఉండే లేదా నూనె పదార్థాలు కలిగిన సమోసా, పకోడీ, వడ వంటి ఆహారాలను పేపర్లలో చుట్టినప్పుడు ఆ రసాయనాలు ఆహారంలోకి చేరే ప్రమాదం ఉందని తెలిపింది.ఇలాంటి కలుషిత ఆహారాన్ని తరచూ తీసుకోవడం వల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు, మెదడుపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడటంతో పాటు క్యాన్సర్ ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు సురక్షితమైన, ఆహార ప్రమాణాలకు అనుగుణమైన పదార్థాలనే ఉపయోగించాలని FSSAI సూచించింది.
previous post

