క్రికెట్ ప్రేమికులకు కంటి నిండా వినోదంఉర్రూతలూగించే బ్యాటింగ్ విన్యాసాలు..అబ్బుర పరిచే బౌలింగ్ ప్రదర్శనలు..ఆశ్చర్య కరమైన ఫీల్డింగ్ చిత్రాలు..ఆఖరి బంతి వరకూ ఫలితం తేలకుండా.. ఉత్కంఠతో ఉత్తేజపరిచే అద్వితీయ పోరాటాలు! క్రికెట్ అభిమానులకు కంటినిండా వినోదం పంచడానికి, మనసంతా తృప్తితో నింపడానికి సర్వం సిద్ధం! ధనాధన్ ఆటతో రెండు నెలల పాటు ప్రేక్షకులను ఊపేసే సమ్మర్ స్పెషల్ వార్షిక క్రికెట్ మేళా వచ్చేసింది!ఈసారి కొంచెం కొత్తగా.. కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా ఉండబోతోంది ఈ టోర్నమెంట్. నిరుటితో పోలిస్తే ఆరు ఫ్రాంఛైజీలకు కెప్టెన్లు మారిపోయారు.చెన్నై, ముంబయి అభిమానులు తమ ఇష్ట సారథుల నాయకత్వాన్ని ఇక చూడలేరు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అనిపించేలా చెరగని ముద్ర వేసిన ధోని, ఇక చాలంటూ కెప్టెన్సీని త్యజించాడు.
బహుశా ఆటగాడిగానూ అతడికి ఇదే చివరి ఐపీఎల్.అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ధోని సరసన ఉన్న రోహిత్ శర్మ.. నాయకత్వాన్ని హార్దిక్ కు కోల్పోయాడు. గుజరాత్ పగ్గాలు శుభమన్ గిల్ అందుకున్నాడు. ఇక కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కిందటి టోర్నీకి దూరమైన విధ్వంసక వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. దిల్లీ కెప్టెన్గా తిరిగి రావడం ఉత్సుకతను రేపుతోంది. హైదరాబాదు కొత్తగా కమిన్స్, కోల్కతాకు శ్రేయస్ అయ్యర్ నాయకులుగా వ్యవహరించనున్నారు.