కడప జిల్లా రహదారుల అభివృద్ధికి కీలక ప్రతిపాదనలు
న్యూఢిల్లీ/కడప, జూలై 29: కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వైఎస్సార్ జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు.
ఈ సందర్భంగా ముద్దనూరు నుంచి కడప వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే కడప నగరంలోని ఇర్కాన్ సర్కిల్ నుంచి జేఎంజే సర్కిల్ వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని కడప కార్పొరేషన్ పరిధిలోని ఇర్కాన్ సర్కిల్ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, ఇంటర్‌లాకింగ్ పేవర్ బ్లాక్స్‌తో పార్కింగ్ సౌకర్యం, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.ఈ మూడు ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: