ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఓ దారుణ హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. భార్యను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని గోమతీ నదిలో పడేసిన భర్తతో పాటు అతని ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉమేంద్ర ప్రతాప్ సింగ్, కాల్ సెంటర్‌లో పనిచేసే ఆర్తీ వర్మ ఏడు నెలల క్రితం క్యాబ్ రైడ్ ద్వారా పరిచయమయ్యారు. ఈ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, వీరిద్దరి వ్యవహారం ఉమేంద్ర భార్య అంజలి సింగ్‌కు తెలియడంతో ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయమై ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండటంతో అంజలిని అడ్డు తొలగించుకోవాలని ఉమేంద్ర, ఆర్తీ పథకం పన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కారులో తీసుకెళ్లి గోమతీ నదిలో పడేశారు.పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఉమేంద్ర నేరానికి పాల్పడిన తర్వాత తానే స్వయంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. మరోవైపు జూలై 31న గోమతీ నదిలో లభ్యమైన ఓ అజ్ఞాత మహిళ శవాన్ని కుటుంబ సభ్యులు అంజలిగా గుర్తించారు. బాతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో నివ్వెరపోయే నిజాలు తెలిసాయి. అంజలి నగలతో ఇల్లు విడిచి వెళ్ళిపోయిందనే నమ్మకం కలిగించేందుకు ఉమేంద్ర సుమారు రూ. 10 లక్షల విలువైన ఆభరణాలను ప్రియురాలు ఆర్తీకి అందజేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి నగలు, రెండు మొబైల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఉమేంద్రపై 2020లో హర్దోయ్ జిల్లాలోనూ ఒక క్రిమినల్ కేసు ఉందని, ఇతర ప్రాంతాల్లోనూ అతని నేర చరిత్రను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: