*నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.విశాఖ, గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
ఈదురు గాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వరదనీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.తుపాను కారణంగా బాపట్ల మండలం సూర్యలంక అడవి పల్లెపాలెం తీరంలో సముద్రం కల్లోలంగా మారింది.సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి.గోవర్ధనపురం, సీఎల్ఎన్పల్లి వద్ద పాముల కాలువ, కాడూరు వద్ద సున్నపు కాలువ, పాండూరు వద్ద రాళ్లవాగు పొంగి పొర్లుతున్నాయి.వరద ఉద్ధృతికి ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. చెరువులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరదయ్యపాలెం చెరువుకు గండి పడే ప్రమాదం ఉండటంతో అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.