తెలుగుదేశం పార్టీలో చాలామంది నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు సైతం తమకు అవకాశం ఎప్పుడు ఇస్తారా అని కాచుకు కూర్చున్నారు. కానీ ఏడాది గడుస్తున్న ఇంతవరకు వారికి అవకాశం చిక్కలేదు. దీంతో వారిలో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేశారు. ఈ ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు సుగవాసి సుబ్రహ్మణ్యం. ఆయన ఓడిపోవడంతో నామినేటెడ్ పదవి కోసం ఎదురు చూశారు. చంద్రబాబు పట్టించుకోకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని టాక్ నడుస్తోంది. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉమామహేశ్వరరావు ఉన్నారని.. ఆయన పార్టీ మారడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం విశేషం.దేవినేని ఉమామహేశ్వరరావుది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ టిడిపి శాసనసభ్యుడిగా ఉండేవారు. రైలు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో అప్పట్లో నందిగామ నియోజకవర్గం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. 2009లో పునర్విభజన జరగడంతో మైలవరం నుంచి పోటీకి దిగారు. ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో చంద్రబాబు తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలోకి వచ్చారు. చంద్రబాబు హామీ మేరకు ఉమామహేశ్వరరావు పక్కకు తప్పుకున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అమలు కాని పదవి హామీ..అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పదవి ఇస్తామని చంద్రబాబు అప్పట్లో దేవినేని ఉమామహేశ్వరరావుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పదవులను పెద్ద ఎత్తున భర్తీ చేశారు. కానీ దేవినేని ఉమామహేశ్వరరావుకు చాన్స్ ఇవ్వలేదు. దీంతో రోజు రోజుకు అసహనం పెంచుకున్న దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్కువగా హైదరాబాదులో గడుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉంటే అధినేతకు అండగా ఉన్న తనను పక్కన పెట్టడంపై ఆయన పూర్తిగా ఆవేదనతో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించిన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది.

next post