రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు చిత్రమైన రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. రెండు ప్రభుత్వాలకు చెందిన ముఖ్యనాయకులు కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తమ ప్రభుత్వం మరో పదేళ్లపాటు ఉంటుందని.. చెప్పుకొచ్చారు. తమను దింపేయాలని కొందరు కుట్రలు చేసినా అవిఫలించలేదన్నారు. అంతేకాదు..వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా అధికారంలోకి వస్తామని చెప్పారు. ఎవరు ఏమనుకున్నా.. ఎవరు ఏం చేసినా.. తాము పదేళ్ల వరకు అధికారంలో ఉంటామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఇక ఏపీ విషయానికి వస్తే.. శుక్రవారం.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పాలన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని చెబుతూనే.. ఆయన మరో 15 ఏళ్ల వరకు కూటమి అధికారంలోనే ఉంటుందని చెప్పారు. వైసీపీకి ఛాన్స్ ఇచ్చేదే లేదని చెప్పారు. అయితే.. పవన్ ఇప్పుడే కాదు.. గతంలోనూ కూటమి 15 ఏళ్లపాటు అధికారంలోనే ఉంటుందని చెప్పారు. కానీ.. ఇప్పుడు మరింత బలంగా నొక్కి మరీ చెప్పుకొచ్చారు. కూటమిని పిడికిలితో పోల్చారు. దీంతో ఆయన చెప్పిన వ్యవహారం ఆసక్తిగా మారింది.అయితే..ఇలా రెండు రాష్ట్రాల కీలక నాయకులు ఇంత ధీమాగా తమ తమ పాలనపై వ్యాఖ్యలు చేయడం వెనుక రీజనేంటి? ఇంత ధీమాకు కారణాలేంటి? అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ విషయానికి వస్తే.. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రత్యర్థులు ఇద్దరు ఉన్నారు. 1) బీఆర్ఎస్. 2) బీజేపీ. ఈ రెండు పార్టీలను కూడా దీటుగా ఎదిరించినప్పుడు మాత్రమే తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎదిరించేందుకు ఉన్న శక్తియుక్తులు ఏంటనేది చూస్తే.. కుల గణనతోపాటు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు కావొచ్చన్నది ఒక అంచనా. దీనికి తోడు ‘రేవంత్ రెడ్డి’ ఇమేజ్ కూడా పార్టీకి కలిసి వస్తోంది. కొందరు రేవంత్ ను వ్యతిరేకించినా.. మాస్‌లోను, క్లాస్‌లోనూ ఆయనకు ఉన్న ఇమేజ్ కలిసి వస్తుందన్న అంచనా అయితే.. ప్రతి ఒక్కరిలోనూ బలంగా ఉంది. ఇదే ఈ పదేళ్ల ధీమాకు కారణమని అంటున్నారు.ఇక, ఏపీ విషయానికి వస్తే.. పిడికిలి వంటి కూటమి మరోసారి విజయం దక్కించుకుంటుందన్న ధీమా కనిపిస్తోంది. ఒకరిద్దరు నాయకులు యాగీ చేసినా.. వారిని బయటకు పంపించేసి..కూటమిగానే వచ్చే ఎన్నికలకువెళ్లాలన్నది వ్యూహం. మరోవైపు.. వైసీపీ చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు ఆ పార్టీకి మైనస్ అవుతున్నాయి. అంతేకాదు.. ఆపార్టీ చేశామని చెబుతున్న సంక్షేమాన్ని కూటమి ఎలానూ చేస్తోంది. ఇక, అర్హులు, అనర్హులు అనేది అప్పుడు వైసీపీ హయాంలోనూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న వ్యవహారాలను పెద్దగా చూడాల్సిన అవసరం లేదని కూటమి భావిస్తోంది. మరోవైపు.. బలమైన మేధావి వర్గం, పెట్టుబడిదారులు, అభివృద్ధి వంటివాటికి తోడు..చంద్రబాబు, పవన్‌ల ఇమేజ్ కారణంగానే మరో 15 ఏళ్లపాటు మాదే అధికారం అని చెప్పడం వెనుక కీలక ధీమా ఉండి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

previous post