కొంతమంది పాత్రికేయులు కొన్ని విషయాలు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. కొన్ని రాతలు రాయడానికి మొహమాటం పడుతుంటారు. కానీ ఆంధ్రజ్యోతి పత్రికా అధినేత అలాంటి మొహమాటాన్ని ప్రదర్శించడు.దాపరికాన్ని కొనసాగించడు. ఏ విషయమైనా సరే మొహమాటం లేకుండా చెబుతుంటాడు. కుండబద్దలు కొట్టినట్టు వ్యక్తం చేస్తుంటాడు. తాజాగా ఆయన ఛానల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో సంచలన వ్యాఖ్యలు చేశాడు వేమూరి రాధాకృష్ణ…గడచిన ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానాన్ని కూడా సంపాదించుకోలేకపోయిన వైసీపీ.. ఇప్పుడు పునర్ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. గుంటూరు పొగాకు రైతులు, రాయలసీమ తోతాపూరి రైతులను జగన్ పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వారికి మద్దతు ధరను అందించాలని డిమాండ్ చేశారు. జగన్ పర్యటన తర్వాత యాదృచ్ఛికంగా కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలలో నగదు వేయడం విశేషం. పొగాకు కొనుగోలు కూడా జరపడం గమనార్హం. అయితే ఇవన్నీ కూడా మా విజయాలని వైసీపీ ప్రచారం చేసుకుంటున్నది. అంతేకాదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని విమర్శిస్తోంది.సహజంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు షరతులు విధిస్తున్నారు. కొంతమందితో మాత్రమే పర్యటన జరపాలని సూచిస్తున్నారు. అయితే దీనిని సవాల్ గా తీసుకున్న వైసీపీ శ్రేణులు భారీగా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేస్తున్నాయి. భారీగా వచ్చిన కార్యకర్తలతో జగన్ పర్యటన జన సంద్రాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో జగన్ పర్యటనలను.. ఆయన ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు. మంత్రులు అట్టర్ ప్లాప్ అవుతున్నారు. ఇదే విషయాన్ని వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో స్పష్టం చేశారు.” 2024 కంటే ముందు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు స్థానంలో ఉన్నారు. ఆయన ఏదైనా సభ లేదా సమావేశం నిర్వహిస్తే ఈ స్థాయిలో కార్యకర్తలు వచ్చేవారు కాదు. ప్రజలు కూడా ఇంతలా హాజరయ్యే వారు కాదు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు మాత్రం జనం విపరీతంగా వస్తున్నారు. ఆయనను చూసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. అంతేకాదు జగన్ ను వారు ఒక హీరోలాగా అభివర్ణించుకుంటున్నారు. అటువంటి వ్యక్తి వచ్చే ఎన్నికలకు ఇప్పుడే ప్లాన్ రూపొందించాడు. దానికి తగ్గట్టుగా కార్యాచరణ మొదలుపెట్టాడు. కానీ కూటమి ప్రభుత్వం ఇంతవరకు జగన్ కు సరైన కౌంటర్ ఇవ్వడంలో విఫలమవుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే 2029లో ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం స్థానం లేకపోయినప్పటికీ వైసిపి ప్రజల్లోకి వెళ్తోంది. పోరాటాలు చేస్తోంది. తమ హయాంలో తప్పులు జరిగినప్పటికీ.. వాటిని కప్పిపుచ్చుతూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దూకుడుగా వెళ్తున్నారు. ఇలా అయితే భవిష్యత్తు కాలంలో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొక తప్పదు. ఇప్పటికైనా కూటమి నాయకులు మారాలి. ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండాలి. మంత్రులు గట్టిగా స్పందించాలి. ఒకరకంగా రాజకీయాలు పిరికిపందలా గాక .. దమ్ముతో చేయాలని” రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో పేర్కొన్నాడు.ఆర్కే వీకెండ్ కామెంట్ లో ఫ్యాన్ పార్టీ అధినేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా టిడిపి నాయకులు వాస్తవంలోకి రావాలని.. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని.. లేకపోతే భవిష్యత్తు కాలంలో పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఆకాశం నుంచి కిందికి దిగి రావాలని.. ప్రతీకార రాజకీయాలు మానుకోవాలని.. ప్రజల సమస్యలు పరిష్కరించాలని వైసీపీ నాయకులు పేర్కొంటున్నారు

previous post