!
లిక్కర్ స్కామ్‌లో సజ్జల భార్గవరెడ్డి పేరు బయటకు వచ్చే సరికి.. తండ్రి సజ్జల తనదైన థీయరీలతో మీడియా ముందుకు వచ్చేశారు. దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు.. చేతనైతే ఓడిపో లాంటి పిచ్చి లాజిక్కుల రాజకీయాలు చేసే ఆయన ఈ సారి కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే తెర ముందుకు వచ్చారు.
అదేమిటంటే.. సజ్జల భార్గవ డైరక్టర్ గా ఉన్న భీమ్ అనే కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదట. బ్యాంక్ అకౌంటే లేని కంపెనీలో లావాదేవీలు ఏం జరుగుతాయని సజ్జల ప్రశ్న.
ఇది ఎలా ఉందంటే.. మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వానికే.. అలాంటప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఎలా అవినీతి చేస్తారని వాదించినట్లుగా ఉంది. ఇంద మాదిరి తెలివితేటలతో కొడుకును వెనకేసుకొచ్చేందుకు ఆయన మరో వింత ప్రయత్నం కూడా చేశారు. అదేమిటంటే.. సజ్జల భార్గవతో పాటు ప్రద్యుమ్న అనే వ్యక్తి కూడా డైరక్టర్ గా ఉన్నారని ..
ఆయన ఒకప్పుడు ఓ టీవీ చానల్ కు డైరక్టర్ గా ఉన్నారని..ఆ చానల్ లో లోకేష్ యాక్టివ్ గా ఉండేవారని చెప్పుకొచ్చారు. బహుశా ఈ ప్రద్యుమ్న లోకేష్‌కు సన్నిహితుడు కావొచ్చని కోడిగుడ్డు మీద ఈక కూడా పీకేశారు.
లోకేష్ యాక్టివ్ గా ఉండటం ఏందో.. ఆ చానల్ లో ప్రద్యుమ్న డైరక్టర్ గా ఉండటం ఏందో.. ఇప్పుడు సజ్జల కుమారిడితో కలిసి బ్యాంక్ అకౌంట్ కూడా లేని కంపెనీ పెట్టడం ఏమిటో..అంతా ఓ మిస్టరీలా ఉంది. అసలు బ్యాంక్ అకౌంటే లేని కంపెనీ ఎందుకు పెట్టాలి.. ఆ కంపెనీతో ఏం చేశారు అన్నది తేలితేనే కదా అసలు ఏం జరిగిందో బయటపడుతుంది. ఈ లోపు సజ్జల ఏదో ఓ కథ చెప్పాలని ఉబలాటపడుతున్నారు.