సబ్ జైల్ వద్ద కలకలం.. లిక్కర్ కేసు నిందితుల ఆందోళన.
బెయిల్ ఇచ్చినా సరే విడుదల చేయడంలేదని నిరసన.
గేటు లోపల బాలాజీ గోవిందప్ప.. జైలు ముందు న్యాయవాదుల బైఠాయింపు
విజయవాడలోని సబ్ జైలు వద్ద లిక్కర్ కేసు నిందితులు, వారి తరఫున వాదిస్తున్న న్యాయవాదులు ఆందోళనకు దిగారు. న్యాయవాదులు జైలు ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా.
జైలు లోపల నిందితులు కూడా ఆందోళన చేస్తున్నట్లు సమాచారం. లిక్కర్ కేసులో అరెస్టయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, ఉద్దేశపూర్వకంగానే జైలు అధికారులు వారిని విడుదల చేయడంలేదని, రిలీజ్ ప్రక్రియను కావాలనే ఆలస్యం చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ సబ్ జైలు సూపరిటెండెంట్ పై న్యాయవాదులు మండిపడ్డారు.
బెయిల్ ఇచ్చినా అధికారులు తమను విడుదల చేయకపోవటంతో జైలు లోపల గేటు దగ్గర బాలాజీ గోవిందప్ప ఆందోళనకు దిగారు. డీఐజీ డౌన్ డౌన్ అంటూ నిందితులు నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, నిందితుల తరఫున వాదిస్తున్న అడ్వకేట్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. ‘శనివారం సాయంత్రమే బెయిల్ ఆర్డర్స్ వచ్చినా జైలు అధికారులు వారిని ఇప్పటికీ విడుదల చేయలేదు. ఇది చట్టవిరుద్ధ నిర్బంధం కిందకు వస్తుందని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళతాం’ అని తెలిపారు.
హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు..?
లిక్కర్ స్కాం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు జారీ చేసిన బెయిల్ పై ప్రాసిక్యూషన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని మరికాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది.