విశాఖపట్నం: విశాఖలో సంచలనం రేపిన ఘటనలో ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తిని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కంచరపాలెం దుర్గానగర్‌కు చెందిన బొలిశెట్టి సురేష్ కుమార్ (32)కు పెందుర్తికి చెందిన సంధ్య (20)తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
గత నెల 15న సంధ్య తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన సురేష్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం జగదాంబ సెంటర్‌లో పెద్ద సూట్‌కేస్ కొనుగోలు చేసి, మృతదేహాన్ని అందులో ఉంచి రైలు ద్వారా ఒడిశాలోని రాయగడ జిల్లా జేకేపూర్ సమీప అటవీ ప్రాంతంలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అటవీ ప్రాంతంలో సూట్‌కేస్ నుంచి దుర్గంధం రావడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. విశాఖపట్నం పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై రాయగడ కోర్టుకు తరలించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: