భక్తులను మోసం చేసిన సస్పెండ్ టీటీడీ ఉద్యోగి అరెస్ట్

సేవా టికెట్లు, ఉద్యోగాల పేరుతో రూ.10 లక్షల మోసం….15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

తిరుపతి: శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని భక్తులను నమ్మించి సుమారు రూ.10 లక్షలు వసూలు చేసిన సస్పెండ్ అయిన టీటీడీ ఉద్యోగిని తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టైన నిందితుడిని తిరుపతికి చెందిన జలకర గిరిధర్ (34)గా పోలీసులు గుర్తించారు. ఇతను టీటీడీలో క్లాస్-4 ఉద్యోగిగా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నట్లు తెలిపారు.తాను టీటీడీ పేష్కార్‌నని చెప్పుకుంటూ, తన పరిచయాలు మరియు పలుకుబడితో శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తులను నమ్మించేవాడని పోలీసులు తెలిపారు. విశ్వాసం కలిగించేందుకు టీటీడీ గుర్తింపు కార్డు ప్రతిని కూడా పంపినట్లు వెల్లడించారు.ఈ వ్యవహారంలో ఓ భక్తుడి నుంచి రూ.1.56 లక్షలు, మరో వ్యక్తికి టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3.60 లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు పలువురి నుంచి సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

భక్తులకు పోలీసుల సూచనలు

శ్రీవారి దర్శనం, సేవలు, వసతి తదితర టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్‌ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సూచించారు.దళారులు, నకిలీ వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా మోసాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని భక్తులను కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *