కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
ప్రొద్దుటూరు,నవంబర్9:
పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రొద్దుటూరు తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు పాలాజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో కడప జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ రంగం, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను ఉచితంగా లేదా రాయితీపై అందించాలని కోరారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ప్రజలకు ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని విమర్శించారు. రైతులకు ఎరువులు, విత్తనాలను సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు.
మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, దళారుల జోక్యంతో సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శులు శేఖర్, సుమన్, జాషువా, సుజాత, ప్రియ, రాజేశ్వరి, సుబ్బమ్మతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు భాస్కర్, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: