భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనాలపై ఆంక్షలు..
శ్రీశైలం, నవంబర్ 10: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 9వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. కార్తీక మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కార్తీక మాసం మొత్తం గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలిపివేయాలని నిర్ణయించారు.
అలాగే కార్తీక శని, ఆదివారాలు, సోమవారాలతో పాటు కార్తీక పౌర్ణమి, ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి స్పర్శ దర్శనాలను పూర్తిగా రద్దు చేయనున్నారు.
మిగిలిన సాధారణ రోజుల్లో భక్తులకు ఐదు విడతలుగా స్వామివారి స్పర్శ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. కార్తీక మాసంలో భక్తులు ఆలయ నిబంధనలను పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: