మైదుకూరు: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, రక్తదాన సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న మైదుకూరుకు చెందిన నేస్తం సేవా సంస్థకు మరో అరుదైన గుర్తింపు లభించింది. మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అందించే ప్రతిష్ఠాత్మక ‘BEST LIFE SAVIOR AWARD – 2026’ అవార్డును నేస్తం సేవా సంస్థ ప్రతినిధి అందుకున్నారు.
ఈ సందర్భంగా నేస్తం సేవా సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. పేరు, గుర్తింపు కోసం కాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలనే సంకల్పంతో తమ సేవా ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించడం, రక్తదాతలను ప్రోత్సహించడం, అత్యవసర సమయాల్లో బాధితులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలు తమకు ఎంతో సంతృప్తినిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ అవార్డు తమ ఒక్కరి విజయం కాదని, నేస్తం సేవా సంస్థ సభ్యులు, దాతలు, రక్తదాతలు, సేవా మిత్రులందరి సమిష్టి కృషికి దక్కిన గౌరవమని తెలిపారు. ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు.
ఒక ప్రాణాన్ని కాపాడగలిగితే అంతకంటే గొప్ప అవార్డు మరొకటి ఉండదని పేర్కొంటూ, ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించిన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు జొన్నలగడ్డ రాజు అన్నయ్యకు నేస్తం సేవా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: