హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాసానికి పార్టీ కార్యకర్తలు, అభిమానుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతున్నది.తమ అభిమాన నేతను చూసేందుకు ప్రతిరోజు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆయనను శాలువాలతో సత్కరించి, కుటుంబసమేతంగా ఫొటోలు దిగుతున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను, అభిమానిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయం కేటాస్తున్నారు. కేసీఆర్ వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. అభిమానుల తాకిడితో కేసీఆర్ నివాసం బుధవారం కికిరిసిపోయింది. వచ్చిన వారందరినీ ఒక్కొక్కరిగా కేసీఆర్ వద్దకు పంపించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ అనే నినాదాలతో ప్రాంతం మార్మోగింది.కార్యకర్తలతో తరలివచ్చిన నేతలుపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, ఇతర ముఖ్యనేతలు కార్యకర్తలతోపాటు వచ్చి అధినేత కేసీఆర్‌తో సమావేశమవుతున్నారు. వారి నుంచి కేసీఆర్ నియోజకవర్గాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. బుధవారం కూడా పలు నియోజకవర్గాల నుంచి వందల సంఖ్యలో కార్యకర్తలతో నాయకులు తరలివచ్చారు. కేసీఆర్‌ను కలిసినవారిలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, పార్టీ ముఖ్యనేతలు రాగిడి లక్ష్మిరెడ్డి, సుధీర్‌బాబు, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవిగౌడ్, గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజినీసాయిచంద్, ఆయా జిల్లాల స్థానిక నాయకులు ఉన్నారు.

previous post
next post