విశాఖపట్నం. ఎన్టీఆర్ కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం జర్నలిస్టులకు ఉచితంగా 4సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వినతి అందజేసి ఆయనతో చర్చించారు . గురువారం విశాఖపట్నం నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లోకేష్ ను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టి తెచ్చారు. ఇతర రాష్ట్రాల్లో రిటైర్డ్ జర్నలిస్టులకు రూ. 10వేల నుంచి రూ. 15వేల వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ సదుపాయం కల్పిస్తున్నాయని, అదే మాదిరిగా మన రాష్ట్రంలోనూ కల్పించాలని కోరారు. కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టులకు రూ.5 లక్షల పరిహారం, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలలో 50 శాతానికి పైగా ఫీజు రాయితీ,ప్రెస్ అక్రిడేషన్లు పెంపు, జర్నలిస్టు సంఘాలకు మీడియా అక్రిడేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం, జర్నలిస్టులపై దాడుల నివారణకు ఐ పవర్ కమిటీలు ఏర్పాటు, స్మాల్ దినపత్రికలు, వార, పక్ష, మాస పత్రికలకు సమాచార, పౌర సంబంధాల శాఖ యాడ్స్ విడుదల తదితర సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ సమస్యల పై స్పందించిన లోకేష్ స్కూల్ ఫీజు రాయితీ విషయంలో కలెక్టర్ల తో మాట్లాడుతానని, జర్నలిస్టులకు గృహాలు కేటాయిస్తా మనితెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనరాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారని, పరిస్థితులను బట్టి ఇతర సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. లోకేష్ ను కలిసిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల బృందంలో లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ (ఎల్ ఎన్ ఏ ) అధ్యక్షుడు వి.సత్యనారాయణ, ఐజే యూ సభ్యుడు ఆర్. రామచంద్రరావు, ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు కె.చంద్రమోహన్, విశాఖ ..జాప్ ప్రధాన కార్యదర్శి కె. ఎం. కీర్తన్, ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొల్లి కమల్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు బి.నారాయణరావు, సురేష్, ఏపీజేయూ అధ్యక్ష, కార్యదర్శులు బి శ్రీధర్, ఎం. శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

next post