బిహార్‌లోని పూర్నియా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 7 ఏళ్ల బాలికకు “ఇది కూల్‌డ్రింక్.. చల్లగా ఉంటుంది, తాగి చూడు” అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు మూత్రం తాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటన బయటపడడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఘటన చంపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింధియా పంచాయతీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగింది. మొదటి తరగతి చదువుతున్న బాలిక పాఠశాల నుంచి ఏడుస్తూ ఇంటికి చేరుకుని, “హెడ్మాస్టర్ కూల్‌డ్రింక్ అని చెప్పి బాటిల్ మూతలో ఏదో తాగించారు” అని కుటుంబ సభ్యులకు తెలిపింది. అనంతరం కుటుంబ సభ్యులు స్కూల్‌కు వెళ్లి ప్రశ్నించగా వివాదం చెలరేగినట్లు సమాచారం. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన హెడ్మాస్టర్ నంద్ కిషోర్ రాయ్‌ను అదుపులోకి తీసుకుని జైలుకు పంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. స్వాధీనం చేసుకున్న బాటిల్లోని పదార్థాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు సమాచారం. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని నిందితుడు పేర్కొన్నట్లు వార్తలు చెబుతున్నాయి.
మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039


