హైదరాబాద్ మెట్రోపోలీటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డు (HMWSSB)లో పనిచేస్తున్న రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో విస్తృతంగా సోదాలు చేపట్టిన అధికారులు భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.సోదాల సందర్భంగా ఇంట్లో నుంచి సుమారు రూ.1.05 కోట్ల నగదు, దాదాపు ఒక కిలో బంగారు ఆభరణాలు లభ్యమైనట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పలు కీలక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఆస్తి వివరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.అంతేకాకుండా, కుమార్కు సంబంధించిన ఆస్తులపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ప్రాథమికంగా హైదరాబాద్న గరంలో 9 ఫ్లాట్లు, అలాగే నిజామాబాదు జిల్లాలో 3 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటివరకు లభ్యమైన వివరాల ప్రకారం ఆయన కుటుంబానికి చెందిన ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.అధికారికి తెలిసిన ఆదాయ వనరులతో పోలిస్తే అధికంగా ఆస్తులు కూడబెట్టిన అనుమానంతో ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలు, స్థిరాస్తులు, పెట్టుబడులు, బినామీ ఆస్తుల కోణంలో కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.అయితే, ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్థాయి వివరాలు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039


