హనుమకొండ: ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ సభ్యులను మోసగించిన ఆరోపణల నేపథ్యంలో భీమదేవరపల్లి జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కలువల ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఎల్వీ గిరిరాజ్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.అధికారుల వివరాల ప్రకారం, ఎల్లయ్య కొన్నేళ్లుగా ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ పలువురు సభ్యులను మోసగించినట్లు ఈ ఏడాది ఏప్రిల్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందింది. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.డీఈవో ఆధ్వర్యంలో నిర్వహించిన దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి అనుమతి లేకుండా ప్రైవేట్ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించినట్లు గుర్తించడంతో ఎల్లయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు.ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో, తదుపరి శాఖాపరమైన చర్యలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.

