Anna Hazare: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) మరోసారి విరుచుకుపడ్డారు..అవినీతి వ్యతిరేక ‘జన్‌లోక్‌పాల్’ ఉద్యమంలో భాగమైన ఆయన.. ఇప్పుడు అవినీతి కేసులోనే అరెస్టు కావడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. కోట్లాది మంది ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని, ఆయన రాజకీయ ఆశయాలు 2011 నాటి ఉద్యమాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు..”దిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం బాధగా ఉంది. ఒకప్పుడు అవినీతిపై పోరాటంలో నా సహచరుడు.. ఇప్పుడు అవినీతి కేసులోనే అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. ‘జన్‌లోక్‌పాల్’ రాజకీయ ప్రత్యామ్నాయం విఫలం కావడం దురదృష్టకరం. రాజకీయ ఆకాంక్షల వల్లే అవినీతి వ్యతిరేక ఉద్యమం నాశనమైంది” అని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నా హజారే తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ‘స్వరాజ్’ పుస్తకంలో మద్యం పాలసీకి సంబంధించిన అంశాలపై 2022లో రాసిన లేఖలోనే తాను హెచ్చరించినట్లు గుర్తు చేశారు..మద్యం విధానానికి (Excise policy Case) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌కు దిల్లీ కోర్టు శుక్రవారం ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. సీఎంగా చేసిన పనులకే ఆయన అరెస్టు అయ్యారని అన్నాహజారే శుక్రవారం స్పందించారు. మద్యం అంశానికి దూరంగా ఉండాలని గతంలో పలుమార్లు హెచ్చరించానని.. కానీ, మరింత సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన ఏకంగా ప్రత్యేక విధానాన్నే తీసుకొచ్చారన్నారు..
