దేశవ్యాప్తంగా
భర్తల హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను గురుగ్రామ్‌కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ విడుదల చేసిన తాజా నివేదిక చర్చనీయాంశమైంది. 2026 తొలి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 554 మంది భర్తలు హత్యలు లేదా ఆత్మహత్యల కారణంగా మరణించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఇవి ప్రభుత్వ అధికారిక గణాంకాలు కావని, మీడియా కథనాలు మరియు ఫౌండేషన్ సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటేషన్ మాత్రమేనని సంస్థ స్పష్టం చేసింది.
నివేదిక ప్రకారం, మొత్తం 322 హత్యలు, 232 ఆత్మహత్యలు నమోదైనట్లు పేర్కొంది. హత్యల్లో గణనీయమైన కేసులు వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగినట్లు, ఆత్మహత్యల్లో కుటుంబ కలహాలు, గృహహింస, మానసిక వేధింపులు, తప్పుడు కేసులు, పిల్లలను కలవనివ్వకపోవడం వంటి కారణాలు ప్రధానంగా ఉన్నాయని నివేదిక తెలిపింది.
రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 93 హత్యలు, 103 ఆత్మహత్యలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. అనంతరం మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
అయితే, ఈ వివరాలకు ప్రభుత్వ అధికారిక ధృవీకరణ లేదని ఫౌండేషన్ స్పష్టం చేసింది. దేశంలో భర్తల హత్యలు లేదా పురుషులపై గృహహింసకు సంబంధించి ప్రత్యేక జాతీయ డేటాబేస్ లేకపోవడంతో, ఈ అంశంపై అధికారిక గణాంకాల సేకరణ అవసరమని సంస్థ సూచించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: