ఒడిశా: వ్యాపారి కిడ్నాప్ కేసు ఒడిశాలో కలకలం రేపింది. బొలాంగీర్‌కు చెందిన హోటల్ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, జర్నలిస్టుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారిని బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసేందుకు నిందితులు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 14న నరేంద్ర సాహును తుపాకీతో బెదిరించి బొలాంగీర్ నుంచి భువనేశ్వర్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఓ హోటల్‌లో నిర్బంధించి దాడి చేసి, తుపాకీతో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.నరేంద్ర సాహు మరో వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు చిత్రీకరించి, ఆ వీడియో ఆధారంగా ఆయనను బ్లాక్‌మెయిల్ చేయాలనేది నిందితుల ఉద్దేశంగా పోలీసులు పేర్కొన్నారు. నరేంద్ర కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. నరేంద్రను తీసుకెళ్లిన వాహనం భువనేశ్వర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశాయి.ఈ కేసులో క్షితీష్ చంద్ర సాహు, సంజీవ్ బెహెరా ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షితీష్ సోదరి స్నేహమంజరి సాహు ఖండగిరి పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారని, ఆమె కూడా కిడ్నాప్ కుట్రలో భాగమైనట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.అలాగే భువనేశ్వర్‌కు చెందిన జర్నలిస్టు సంజయ్ జెనా పోలీస్ అధికారిగా నటిస్తూ నరేంద్రను ఖండగిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: