ఎలక్ట్రిక్ విమానయాన రంగంలో కీలక ముందడుగు పడింది. స్వీడన్‌కు చెందిన హార్ట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన 30 సీట్ల X1 ఎలక్ట్రిక్ విమానం బ్యాటరీ విద్యుత్‌తోనే తొలి ప్రయోగాత్మక ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
న్యూయార్క్‌లోని ప్లాట్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నిర్వహించిన ఈ ప్రయోగాత్మక ప్రయాణంలో ప్రయాణికులు ఎవరూ లేరు. కేవలం ఒక పైలట్ మాత్రమే విమానాన్ని నడిపారు. సుమారు 25,000 పౌండ్ల బరువు, 106 అడుగుల రెక్కల విస్తీర్ణం కలిగిన X1.. బ్యాటరీ పవర్‌తో 27 నిమిషాల పాటు గాల్లో ప్రయాణించి, గరిష్ఠంగా 1,100 అడుగుల ఎత్తుకు చేరుకుంది.
X1 పూర్తిగా బ్యాటరీ-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థతో పనిచేస్తుందని హార్ట్ ఏరోస్పేస్ తెలిపింది. ఈ వ్యవస్థ 1 మెగావాట్‌కు పైగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలదని కంపెనీ వెల్లడించింది.
💰 27 నిమిషాల ప్రయాణానికి ఎంత ఖర్చు?
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రయోగాత్మక ప్రయాణంలో విమానం వినియోగించిన విద్యుత్ ఖర్చు సుమారు 5 డాలర్లు మాత్రమే. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.400–450 వరకు.
అయితే ఇది కేవలం విమానం వినియోగించిన విద్యుత్ ఖర్చు మాత్రమే. పైలట్ జీతం, నిర్వహణ, విమానాశ్రయ ఫీజులు, బ్యాటరీ క్షీణత, బీమా, ఇతర నిర్వహణ ఖర్చులు ఇందులో ఉండవు.
🛫 సాధారణ ప్రయాణికుల విమానాలు ఎప్పటి నుంచి?
X1 ప్రయోగం చిన్న వాణిజ్య విమానం స్థాయిలో బ్యాటరీ-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సాధ్యమేనని చూపించినప్పటికీ.. బ్యాటరీ బరువు, విమాన రేంజ్ వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయి. అందువల్ల పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానాలు ప్రస్తుతం సాధారణ ప్రయాణాలకు అందుబాటులోకి రాలేదు.
అయితే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ విమానాలు విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలను తగ్గించి, ప్రయాణికుల టికెట్ ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: