1996లో నమోదైన రూ.20 లంచం ఆరోపణల కేసులో గుజరాత్ ప్రభుత్వానికి చెందిన క్లర్క్, ప్యూన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దిగువ కోర్టులు, గుజరాత్ హైకోర్టు విధించిన శిక్షలను సుప్రీంకోర్టు రద్దు చేసింది.ఓ విద్యార్థికి ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.120 లంచం డిమాండ్ చేశారన్నది ఆరోపణ. ఏసీబీ నిర్వహించిన ట్రాప్‌లో ప్యూన్ వద్ద రూ.20 నగదు లభించగా.. క్లర్క్ వద్ద ఆరోపించిన రూ.100 మాత్రం స్వాధీనం కాలేదు.లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫిర్యాదుదారు వాంగ్మూలంలోనూ వ్యత్యాసాలు ఉన్నాయని ధర్మాసనం గుర్తించింది. కేవలం రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన లంచం డిమాండ్, స్వీకరణ రుజువైనట్లు భావించలేమని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో దిగువ కోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పులను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. క్లర్క్, ప్యూన్ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో దాదాపు 30 ఏళ్లుగా సాగిన న్యాయపోరాటానికి ఎట్టకేలకు ముగింపు లభించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: