నేడు ఆకాశంలో అరుదైన దృశ్యం.. భూమికి దగ్గరగా శనిగ్రహం
ఆకాశ వీక్షకులకు ఆదివారం సాయంత్రం అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. శనిగ్రహం భూమికి సాపేక్షంగా అత్యంత సమీప స్థానానికి చేరుకోవడంతో రాత్రి ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించనుంది.
ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:59 గంటల నుంచి శనిగ్రహాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. తూర్పు ఆకాశంలో లేత పసుపు రంగులో ప్రకాశించే శనిగ్రహాన్ని సాధారణంగా కంటితోనే గుర్తించవచ్చని పేర్కొంది.
టెలిస్కోప్‌తో వలయాలు వీక్షించే అవకాశం
శనిగ్రహాన్ని ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే రాత్రి వేళ చూడవచ్చు. అయితే బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉపయోగిస్తే శనిగ్రహం చుట్టూ ఉన్న ప్రసిద్ధ వలయాలను మరింత స్పష్టంగా వీక్షించే అవకాశం ఉంటుంది.
భూమి నుంచి శనిగ్రహం సాధారణంగా సుమారు 126 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి సాపేక్ష సమీప స్థానం గతంలో 2025 సెప్టెంబర్ 21న కూడా ఏర్పడింది.
ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యాన్ని వీక్షించాలనుకునే వారు వెలుతురు కాలుష్యం తక్కువగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటే మరింత స్పష్టంగా శనిగ్రహాన్ని చూడవచ్చు.
Save or share this story as a newspaper-style Epaper Clip: