ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర తుఫాన్.. మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన

నవంబర్ 16న తుఫాన్‌గా, 17న తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

18,19 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. నవంబర్ 16న ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉండగా, 17వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ తీరంవైపు కదిలే అవకాశముందని తెలిపింది.

18, 19 తేదీల్లో అతి భారీ వర్షాలు

తుఫాన్ ప్రభావంతో ఈ నెల 18, 19 తేదీల్లో కోస్తాంధ్ర ప్రాంతంలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు

తుఫాన్ ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

మత్స్యకారులకు కీలక హెచ్చరిక

సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తుఫాన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణశాఖ సూచనలు పాటించాలని కోరారు.

తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ కదలికలు, తీవ్రత, తీరం వైపు దాని ప్రయాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *