13 మండలాల్లో 203 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు.. 1,984 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
నవంబర్ 18 నుంచి నామినేషన్లు.. 29న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
3,42,983 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు
కడప, నవంబర్ 17:
వైఎస్సార్ కడప జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎన్నికల సన్నద్ధత వివరాలను వెల్లడించారు.
రెండో విడతలో జిల్లాలోని 13 మండలాల పరిధిలో 203 గ్రామ పంచాయతీలకు సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 54 క్లస్టర్లు, 1,984 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 3,42,983 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
13 మండలాల్లో ఎన్నికల నిర్వహణ
సి.కె.దిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు, చెన్నూరు, కమలాపురం, చక్రాయపేట, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వి.ఎన్.పల్లి, వేంపల్లి, వేముల మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.
మండలాల వారీగా సి.కె.దిన్నెలో 12, పెండ్లిమర్రిలో 19, వల్లూరులో 13, చెన్నూరులో 10, కమలాపురంలో 18, చక్రాయపేటలో 16, లింగాలలో 19, పులివెందులలో 6, సింహాద్రిపురంలో 20, తొండూరులో 15, వి.ఎన్.పల్లిలో 22, వేంపల్లిలో 17, వేములలో 16 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
18 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ఆర్డీఓకు అప్పీలు చేసుకోవచ్చు. నవంబర్ 23న అప్పీళ్లను పరిష్కరిస్తారు. నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
29న పోలింగ్.. అదే రోజు ఫలితాలు
నవంబర్ 29వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. అదే రోజు ఉప సర్పంచి ఎన్నిక కూడా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
1,984 బ్యాలెట్ పెట్టెల కేటాయింపు
రెండో విడత ఎన్నికల కోసం మొత్తం 1,984 బ్యాలెట్ పెట్టెలను కేటాయించారు. వీటిలో 331 పెట్టెలు ఇప్పటికే ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. అదనంగా 207 పెద్దవి, 784 మధ్యస్థ పరిమాణం, 662 చిన్న పరిమాణం కలిగిన బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సామగ్రిని సంబంధిత కేంద్రాలకు సకాలంలో చేరవేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ అనంతరం బ్యాలెట్ పెట్టెల స్వీకరణ, భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: