13 మండలాల్లో 235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు.. 2,364 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
డిసెంబర్ 2న పోలింగ్.. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
కడప, నవంబర్ 19: వైఎస్సార్ కడప జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి, భద్రతా చర్యలను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో జిల్లాలోని 13 మండలాల్లో మొత్తం 235 గ్రామ పంచాయతీలకు సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,364 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విడతలో 4,55,393 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
13 మండలాల్లో ఎన్నికల సందడి
మూడో విడతలో మైదుకూరు మండలంలో 13, బి.మట్టం 11, చాపాడు 22, దువ్వూరు 23, జమ్మలమడుగు 14, కొండాపురం 24, ముద్దనూరు 19, మైలవరం 19, పెద్దముడియం 22, ప్రొద్దుటూరు 15, రాజుపాలెం 15, ఎర్రగుంట్ల 17, ఖాజీపేట మండలంలో 21 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
64 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లావ్యాప్తంగా 64 క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ప్రతి మండలానికి ఒకటి చొప్పున 13 రిజర్వ్ క్లస్టర్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ గ్రామ పంచాయతీకి కేటాయించిన క్లస్టర్ కేంద్రంలోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
నవంబర్ 21 నుంచి నామినేషన్లు
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 21 నుంచి 23 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. నవంబర్ 26న అప్పీళ్ల పరిష్కారం, నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
డిసెంబర్ 2న పోలింగ్.. అదే రోజు కౌంటింగ్
డిసెంబర్ 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అదే రోజు ఉప సర్పంచి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. అవసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్‌లో అవకాశం కల్పించారు.
2,364 బ్యాలెట్ పెట్టెలు సిద్ధం
ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 2,364 బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేశారు. ఇప్పటికే 489 పెట్టెలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలకు అందుబాటులో ఉంచారు. అదనంగా 333 పెద్దవి, 858 మధ్యస్థం, 684 చిన్న పరిమాణం కలిగిన బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేశారు.
అభ్యర్థులకు కలెక్టర్ సూచనలు
అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే ముందే తమ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచి పదవి రిజర్వేషన్ వివరాలను తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నట్లు ఆధారం, గుర్తింపు కార్డు, అవసరమైన కుల ధ్రువీకరణ పత్రం, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్, నామినేషన్ రుసుము తదితర పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తగిన శిక్షణ అందించాలని, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని, ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: