విశాఖపట్నం మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చాడు. వివరాలిలా ఉన్నాయి. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్ లో ఓ జంట మధ్య తగాదా జరుగుతోంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కనక మహాలక్ష్మి టోల్ ఫ్రీ నంబర్ 112కు ఫిర్యాదిచ్చింది. దీంతో విధుల్లో ఉన్న బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ జి.రాజు నాయుడు సంఘటన స్థలానికి వెళ్లాడు. భార్యభర్తల మధ్య తగాదాను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న కనకమహాలక్ష్మి భర్త రాజు.. సదరు కానిస్టేబుల్పై దాడికి దిగాడు. తమ మధ్య జరుగుతున్న తగాదాకు నీవెవరంటూ ప్రశ్నించాడు. కంటిపైనా, మోచేతిపైనా బలంగా కొట్టాడు. మందుబాబు నుంచి తప్పించుకునేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించినా వెంటాడి మరీ దాడి చేశాడు. దీంతో గాయాల్కెన కానిస్టేబుల్ను సహచరులు ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

previous post