ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య 8 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇరుదేశాలు పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది.తమపై దాడి చేసేందుకు ఇరాన్ క్లస్టర్ బాంబులను ఉపయోగించిందని టెల్‌అవీవ్ దళాలు ఆరోపించాయి. యుద్ధం మొదలైనప్పటినుంచి టెహ్రాన్ తొలిసారి వీటిని ఉపయోగించింది.ఈ క్షిపణి వార్‌హెడ్ 7 కి.మీ. ఎత్తులో పేలి 20 చిన్న మందుగుండు సామగ్రిగా విడిపోయి పలు ప్రాంతాల్లో పడ్డాయని హోమ్ ఫ్రంట్ కమాండ్ తెలిపింది. ఇరాన్‌కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయని టెల్‌అవీవ్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను సైన్యం వెల్లడించలేదు. అయితే, ఇజ్రాయెల్ వార్తా సంస్థ ప్రకారం.. ఈ క్షిపణుల్లో ఒకటి అజోర్‌లోని మధ్య పట్టణంలో ఓ నివాసాన్ని తాకినట్లు తెలుస్తోంది. అయితే, దీని కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా.. ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయని, ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ఈక్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. అలాంటివాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది. పౌరులకు హాని కలిగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందని టెల్‌అవీవ్ సైనికాధికారి ఆరోపించారు. యుద్ధ తీవ్రతను పెంచేందుకు భారీ ముప్పును కలిగించేలా ఈ ఆయుధాలను ఉపయోగిస్తుందన్నారు.కాగా.. 2008లో 111 దేశాలతో సహా 12 ఇతర సంస్థలు క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ, వాడకంపై అంతర్జాతీయంగా నిషేధించినట్లు తెలిపే పేపర్లపై సంతకం చేశాయి. అయితే, ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం అందులో చేరేందుకు నిరాకరించాయి.కొత్త రివల్యూషనరీ గార్డ్‌ను నియమించిన ఇరాన్..ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్‌లో పలువురు కీలక నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా వారి స్థానాన్ని టెహ్రాన్ భర్తీ చేస్తూ వస్తోంది. అందులోభాగంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మాజిద్ ఖాదేమిని నియమించింది.

next post